మత్తయి సువార్త
చాప్టర్ 12
1 ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంటచేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.
2 పరిసయ్యులదిచూచి ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా
3 ఆయన వారితో ఇట్లనెనుతానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువ లేదా?
4 అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతో కూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను.
5 మరియు యాజ కులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదిన మును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా?
6 దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.
7 మరియుకనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు.
8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను.
9 ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను.
10 వారాయనమీద నేరము మోపవలెననివిశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి.
11 అందుకాయనమీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా?
12 గొఱ్ఱ కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి
13 ఆ మనుష్యు నితోనీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను.
14 అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
15 యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహు జనులాయనను వెంబడింపగా
16 ఆయన వారినందరిని స్వస్థ పరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.
17 ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా
18 ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయనమీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును.
19 ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు
20 విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు
21 ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అను
22 అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థ పరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.
23 అందుకు ప్రజలందరు విస్మయమొంది ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొను చుండిరి.
24 పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్య ములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.
25 ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణ మైనను ఏ యిల్లయినను నిలువదు.
26 సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?
27 నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు.
28 దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది.
29 ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును.
30 నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.
31 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగామనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.
32 మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.
33 చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.
34 సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.
35 సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.
36 నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.
37 నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అప రాధివని తీర్పునొందుదువు.
38 అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరుబోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరు చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను.
39 వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగు చున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.
40 యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.
41 నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
42 విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంత ములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
43 అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును.
44 విశ్రాంతి దొరకనందుననేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుటచూచి, వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును.
45 అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించు ననెను.
46 ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాట లాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి.
47 అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.
48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి
49 తన శిష్యులవైపు చెయ్యి చాపిఇదిగో నా తల్లియు నా సహోదరులును;
50 పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహో దరియు, నాతల్లియు ననెను.