యెషయా గ్రంథము

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66

చాప్టర్ 35

1 అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును
2 అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.
3 సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.
4 తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.
5 గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును
6 కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును
7 ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.
8 అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు
9 అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు
10 వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.