సామెతలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

చాప్టర్ 22

1 గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.
2 ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే.
3 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
4 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ మునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.
5 ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును.
6 బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
7 ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.
8 దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.
9 దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును.
10 తిరస్కారబుద్ధిగలవాని తోలివేసినయెడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును.
11 హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును.
12 యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును.
13 సోమరిబయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.
14 వేశ్య నోరు లోతైనగొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును.
15 బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.
16 లాభమునొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయు వానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును.
17 చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము.
18 నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము.
19 నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి యున్నాను?
20 నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర మిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై
21 ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని.
22 దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు.
23 యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచు కొనును.
24 కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము
25 నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.
26 చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.
27 చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపో నేల?
28 నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
29 తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదు టనే నిలుచును.