దినవృత్తాంతములు రెండవ గ్రంథము

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36

చాప్టర్ 21

1 యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించి...తన పితరులచెంతను దావీదు పురమందు పాతిపెట్ట బడెను, అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను.
2 యెహోషాపాతు కుమారులైన అజర్యా యెహీయేలు జెకర్యా అజర్యా మిఖాయేలు షెఫట్య అను వారు ఇతనికి సహోదరులు; వీరందరును ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు.
3 ​వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తవస్తువులనేక ములను యూదా దేశములో ప్రాకారముగల పట్టణములను వారికిచ్చెను; అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను.
4 ​​యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని, తన సహోదరులనందరిని ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతముచేసెను.
5 ​యెహోరాము ఏలనారంభించి నప్పుడు ముప్పది రెండేండ్లవాడు. అతడు యెరూష లేములో ఎనిమిది సంవత్సరములు ఏలెను.
6 అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతి వారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచెను; అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.
7 అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీప మిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను.
8 అతని దినములలో ఎదోమీయులు తిరుగబడి యూదావారి అధి కారము త్రోసివేసి తమకు ఒకరాజును చేసికొనగా
9 యెహోరాము తన చేతిక్రిందనున్న అధి కారులను వెంట బెట్టుకొని, తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతముచేసెను.
10 కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగ బడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతిక్రిందనుండి తిరుగబడెను.
11 మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదావారిని విగ్రహపూజకు లోపరచెను.
12 అంతట ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెనునీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగానీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక
13 ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్థులను వ్యభిచరింపజేసి, నీకంటె యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు.
14 కాబట్టి గొప్ప తెగులుచేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనములన్నిటిని మొత్తును.
15 ​నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు; దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును.
16 మరియు యెహోవా యెహోరాముమీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా
17 వారు యూదా దేశముమీదికి వచ్చి దానిలో చొరబడి రాజ నగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి; అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారు డైనను విడువబడలేదు.
18 ఇదియంతయు అయినతరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున
19 రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు.
20 అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.